

కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ₹98 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పర్యాటకులు ఎక్కువ సమయం గడిపేలా ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రైవేట్ భాగస్వామ్యంతో హోటళ్లు, రిసార్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి స్వదేశీ దర్శన్ పనులను పరిశీలించిన అనంతరం సూర్యలంక బీచ్‌కు “బే ఆఫ్ బాపట్ల” పేరుతో బ్రాండింగ్ ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగానికి ప్రత్యేక పాలసీ తీసుకువచ్చి పారిశ్రామిక హోదా కల్పించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. కేవలం 18 నెలల్లోనే ₹20 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా చిత్రీకరణలను ప్రోత్సహిస్తూ సూర్యలంక వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిగితే పర్యాటకానికి మరింత ప్రచారం లభిస్తుందని పేర్కొన్నారు. పుష్ప: ది రైజ్ సినిమా షూటింగ్ తర్వాత మారేడుమిల్లి పర్యాటకంగా అభివృద్ధి చెందిన ఉదాహరణను గుర్తు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ “హ్యాపీ, హెల్దీ ఆంధ్రప్రదేశ్” నినాదంతో టూరిజాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!