

అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో భారీ రద్దీ నెలకొంది. సెక్యూరిటీ చెకింగ్‌ల కోసం ప్రయాణికులు నాలుగు గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమైన పాక్షిక ప్రభుత్వ షట్‌డౌన్ దీనికి ప్రధాన కారణంగా మారింది. జీతాలు లేకుండా పనిచేయడానికి నిరాకరిస్తూ టీఎస్ఏ సిబ్బంది గైర్హాజరవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. న్యూయార్క్, హూస్టన్, అట్లాంటా వంటి నగరాల్లో 30 శాతం కంటే ఎక్కువ టీఎస్ఏ ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇమిగ్రేషన్ అధికారులు, హోంల్యాండ్ సెక్యూరిటీ సిబ్బందిని రంగంలోకి దించారు. అవసరమైతే నేషనల్ గార్డ్‌ను కూడా మోహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిధులపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య నెలకొన్న వివాదం షట్డౌన్కు దారితీసింది. ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పులు చేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తుండగా, భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్లు వాదిస్తున్నారు. షట్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి 860 మందికి పైగా టీఎస్ఏ అధికారులు రాజీనామా చేయగా, దాదాపు 50 వేల మంది జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు ఖర్చులు తగ్గించుకోవడానికి విమానాశ్రయాల్లోనే నిద్రిస్తుండగా, మరికొందరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే విమాన రాకపోకల నిర్వహణ మరింత కష్టమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!