

హైదరాబాద్ నుంచి అనేక మంది తమ సొంత ఊళ్లకు తరలి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ రంగంలోకి దిగింది. పండుగ కోసం ఏకంగా 6,431 ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి ఇతర తెలంగాణ జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. అంతేకాకుండా, పండుగ తరువాత సొంతూళ్ల నుంచి తిరిగొచ్చే వారి కోసం ఈ నెల 18, 19 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి (TGSRTC Sankranti Special Buses). అయితే, ప్రత్యేక బస్సు టిక్కెట్లపై 50 శాతం అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌లోని ఎమ్జీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరామ్‌గఢ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర రద్దీ స్టేషన్స్‌లో ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ ఆయా స్టేషన్లలో తాగు నీటి వసతి, మొబైల్ టాయ్‌లెట్స్, కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, బస్సు రాకపోకలను తెలియజేసేలా ప్రత్యేక అనౌన్స్మెంట్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తోంది. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికుల కోసం కొన్ని చోట్ల తాత్కాలిక షెల్టర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో కూడా మహిళలకు ఉచిత బస్సు సర్వీసు యథావిధిగా అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!