

పండగ సమయాల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని బెరాసియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ట్రాక్టర్-ట్రాలీ మరియు పికప్ వాహనం తీవ్రంగా ఢీ కొనడం తో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెరాసియా పరిధిలోని విద్యా విహార్ ఎదురుగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతులంతా పికప్ వాహనంలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. మృతులను సిరోంజ్ నివాసితులు ముఖేష్ అహిర్వర్ (40), బాబ్రీ బాయి (60), దీపక్ (14), లక్ష్మీ బాయి (60), హరి బాయి (60)గా గుర్తించారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. బెరాసియా SDM అశుతోష్ శర్మ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ, మృతుల సంఖ్యను ధృవీకరించారు. గాయపడిన వారిని సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!