

రాజమండ్రి–కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్ లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ మృతి చెందారు. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమవారం (2026 ఫిబ్రవరి 2) రాత్రి కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు ఒకే బైక్పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బాబీ మోటార్సైకిల్తో బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బాబీకి తలకు తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు.
‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’తో పాటు యాంకర్ సుమ నిర్వహించే పలు ఎంటర్టైన్మెంట్ షోల ద్వారా బాబీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సినీ, టెలివిజన్ రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రమాద వార్త వెలువడిన వెంటనే పలువురు జబర్దస్త్ కమెడియన్లు, సహచరులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి చేరుకున్న యాంకర్ సుమ బాబీ భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!