

తెలంగాణలో మరో ప్రధాన రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్–బీజాపూర్ నేషనల్ హైవే (NH-163)లో భాగమైన మొయినాబాద్–చేవెళ్ల మార్గంలో 46 కిలోమీటర్ల రోడ్డు పనులు త్వరలో వేగంగా సాగనున్నాయి. పర్యావరణ ప్రేమికులు వేసిన కేసు ఉపసంహరించుకోవడంతో, న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఇరుకు రోడ్డు కారణంగా ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్న ఈ మార్గంలో ఇప్పుడు 4 లైన్ల విస్తరణ జరగనుంది. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కి.మీ పొడవునా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే రూ.920 కోట్లు మంజూరయ్యాయి. అయితే రోడ్డు విస్తరణలో చెట్లు నరుకుతారనే ఆందోళనతో పర్యావరణ కార్యకర్తలు ప్రణవ్, తేజ్‌లు ఎన్జీటీలో కేసు వేయడంతో పనులు ఆగిపోయాయి.
రహదారి ప్రమాదాల సమస్యను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని, చెట్ల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. చెట్లకు హాని లేకుండా కొత్త డిజైన్ సిద్ధం చేయడంతో పర్యావరణ కార్యకర్తలు సంతృప్తి చెందారు. దీంతో వారు తమిళనాడులోని ఎన్జీటీ కోర్టులో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 950 చెట్లను రక్షించేలా ప్రణాళిక రూపొందించగా, వాటిలో 150 చెట్లను రోడ్డు పక్కనే పునరావాసం చేయనున్నారు. మిగతా చెట్లను రోడ్డు మధ్య విభాగంలో ఉంచే విధంగా డిజైన్ చేశారు.
ఇక పనులు పూర్తి అయితే చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించి, ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మొయినాబాద్–చేవెళ్ల రహదారిపై పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!