

పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేసిన విజన్ 2047 డాక్యుమెంట్ ప్రకారం, 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) ప్రాంతాలుగా విభజించి, ప్రత్యేక అభివృద్ధి వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ చట్టపరమైన మార్పులు చేపట్టింది. జీహెచ్ఎంసీని ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించారు.
ప్రజలకు మెరుగైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా ఏర్పాటు చేసింది. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయం, బుద్వేల్ హైకోర్టు వంటి కీలక ప్రాంతాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, రాయదుర్గ్ వంటి ఐటీ హబ్‌లు, పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ వంటి పారిశ్రామిక ప్రాంతాలు సైబరాబాద్ పరిధిలో ఉంటాయి. రాచకొండ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి కమిషనరేట్‌గా ఏర్పాటు చేయగా, భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.








.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!