

మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో దాదాపు 40 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది. శుక్రవారం రోజున తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఈ లొంగుబాటు జరిగినట్లు సమాచారం.
లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు రాష్ట్రస్థాయి నాయకులతో పాటు ఛత్తీస్‌గఢ్ కు చెందిన కేడర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సరెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల పూర్తిస్థాయి అంతం తప్పదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల పై భద్రతా బలగాలు విస్తృతంగా చర్యలు చేపట్టాయి.
ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే పలువురు మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందారు. హిడ్మా, చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, బస్వరాజ్ వంటి కీలక నేతలు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడంతో మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
కీలక నేతల మరణంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పలువురు మావోయిస్టులు అడవులను విడిచి సాధారణ జనజీవనంలోకి వస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి గట్టి షాక్‌గా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!