

గత 13 ఏళ్లుగా అకస్మారక స్థితిలో ఉన్న 31 ఏళ్ల హరీష్ రాణా ప్రశాంతంగా మరణించేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక వ్యక్తికి కారుణ్య మరణానికి (Mercy Death) అనుమతి ఇవ్వడం భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వైద్య, న్యాయ రంగాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
2013లో పంజాబ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి హరీష్ రాణా, తాను నివసిస్తున్న పేయింగ్ గెస్ట్ హౌజ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ఘటన తర్వాత నుంచి ఆయన లైఫ్ సపోర్ట్‌పై జీవిస్తున్నారు. శ్వాస కోసం ట్రాకియోస్టమీ ట్యూబ్, ఆహారం అందించేందుకు గ్యాస్ట్రోజెజునోస్టమీ ట్యూబ్ సహాయంతో మంచానికే పరిమితమయ్యారు. ఈ కఠిన పరిస్థితుల్లో కూడా హరీష్ రాణా తల్లిదండ్రులు గత 13 ఏళ్లుగా తమ కుమారుడికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు.
అయితే ఈ దీర్ఘకాలంలో హరీష్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఇక కోలుకునే అవకాశం లేకపోవడంతో తన కుమారుడు ప్రశాంతంగా మరణించేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం, రోగి కోలుకునే అవకాశమే లేని పరిస్థితుల్లో చికిత్సను కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!