

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలోచనా విధానాన్ని మెరుగుపరుచుకుంటేనే ఎంచుకున్న రంగంలో రాణించగలమన్నారు. సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా గుడుపల్లెలోని అగస్త్య విద్యాచల్ను సందర్శించిన సీఎం, అక్కడ రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్, ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి, విద్యార్థులతో కలిసి కార్యక్రమాలపై వీడియోను వీక్షించారు.
ఈ సందర్భంగా కుప్పం ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. హంద్రీ–నీవా జలాలతో నిండిన చెరువుకు జలహారతి ఇచ్చారు. కంగుందిలో హెరిటేజ్ విలేజ్–బౌల్డరింగ్ పార్క్‌ను ప్రారంభించి, పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హోంస్టేలు, టెంట్ అకామిడేషన్లను పరిశీలించారు. అలాగే కో-వర్కింగ్ స్పేస్ కేంద్రం, ఆదిత్య బిర్లా నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. అగస్త్య వ్యవస్థాపకుడు రామ్‌జీ రాఘవన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక అవగాహన పెంచేలా ఇలాంటి కేంద్రాలు కీలకమన్నారు. చిన్నారుల ఆవిష్కరణలను ప్రశంసించిన చంద్రబాబు, వారి ప్రోత్సాహార్థం రూ.10 వేల బహుమతి ఇవ్వాలని ఆదేశించడం ఆకట్టుకుంది.




.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!