

అమెరికాలో మంచు తుఫాన్ తీవ్ర స్థాయికి చేరింది. మిచిగాన్ రాష్ట్రంలో భారీ మంచు కురవడంతో ఇంటర్‌స్టేట్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. గ్రాండ్ రాపిడ్స్ సమీపంలోని హడ్సన్‌విల్లే ప్రాంతంలో మంగళవారం (జనవరి 19) ఉదయం 100కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొంతమంది వాహనదారులు గాయపడ్డారు. అయితే ప్రాణనష్టం జరగలేదు.
మిచిగాన్ స్టేట్ పోలీసుల సమాచారం ప్రకారం, గ్రేట్ లేక్స్ నుంచి వచ్చిన లేక్-ఎఫెక్ట్ స్నో కారణంగా రోడ్లు పూర్తిగా మంచుతో కప్పబడ్డాయి. బలమైన మంచు గాలులు వీస్తుండటంతో ముందున్న వాహనాలు కనిపించక, వాహనాలు జారిపడి ప్రమాదాలు జరిగాయి. ట్రక్కులు, కార్లు సహా అనేక వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి.
ప్రమాదంలో చిక్కుకున్నవారిని హడ్సన్‌విల్లే హైస్కూల్‌కు తరలించి సహాయం అందించారు. హైవేను తాత్కాలికంగా మూసివేసి, సాయంత్రం 6 గంటల తర్వాత మళ్లీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉండగా, నార్తర్న్ మిన్నెసోటా నుంచి న్యూయార్క్ వరకు అనేక రాష్ట్రాల్లో తీవ్ర చలితో పాటు మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్, జార్జియా వంటి ప్రాంతాల్లోనూ అరుదుగా మంచు కురవడం గమనార్హం. చికాగో, మసాచుసెట్స్‌లో ఈ పరిస్థితుల వల్ల క్రీడా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!