

2025 మే నెలలో భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ ఒక చారిత్రక మలుపుగా నిలిచిందని స్విట్జర్లాండ్‌కు చెందిన సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పెర్స్పెక్టివ్ స్టడీస్ (CHPM) తన తాజా నివేదికలో వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్ మొత్తం 88 గంటల పాటు కొనసాగగా, భారత వైమానిక దళం చేపట్టిన తీవ్ర దాడుల వల్ల పాకిస్థాన్ సైన్యం తీవ్రంగా దెబ్బతిని, చివరకు కాల్పుల విరమణ కోరే స్థితికి చేరుకుందని నివేదిక స్పష్టం చేసింది. భారతదేశం అనుసరించిన ‘ఎస్కలేషన్ డామినెన్స్’ వ్యూహాన్ని పాక్ ఎదుర్కోలేకపోయిందని అధ్యయనం పేర్కొంది.
ఈ ఆపరేషన్‌లో భారత యుద్ధ విమానాలు పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలు, కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయని నివేదిక వివరించింది. ఎస్-400 క్షిపణి వ్యవస్థ పాక్ డ్రోన్లు, విమానాలను సమర్థంగా అడ్డుకోగా, బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులు 200 కిలోమీటర్ల లోతులోని లక్ష్యాలను ఛేదించాయి. దీంతో పాక్ రాడార్లు, కమాండ్ సెంటర్లు నిర్వీర్యమయ్యాయి. ఈ సైనిక విజయం ప్రభావం ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. కర్తవ్యపథ్‌పై నిర్వహించిన పరేడ్‌లో ఆపరేషన్ సిందూర్‌లో వినియోగించిన స్వదేశీ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారిగా బ్యాటిల్ ఎరే ఫార్మాట్లో భారత సైన్యం కవాతులో పాల్గొనడం దేశ సైనిక సత్తాను ఘనంగా చాటింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!