

రాష్ట్ర ఆదాయానికి ప్రధాన ఆధారం గా ఉన్న మద్యం విక్రయాలకు సంబంధించిన కొత్త విధానం సోమవారం నుండి అమల్లోకి రానుంది. లైసెన్సులు పొందిన వ్యాపారులు తమ దుకాణాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కొత్త పాలసీ 2027 నవంబర్ వరకు కొనసాగనుంది. తాజా మార్పుల తో రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
2023–25 మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిసింది. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు అంచనాలను మించి పెరిగాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్ విక్రయాలు జరగగా, వీటి విలువ రూ.71,550 కోట్లకు చేరింది. పాత పాలసీ ప్రారంభమైన 2023 డిసెంబరు లో ఒక్క నెలలోనే రూ.4,297 కోట్ల వ్యాపారం నమోదైంది. 2024 జనవరి నుండి డిసెంబరు వరకు రూ.37,485 కోట్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి నుండి నవంబరు వరకు రూ.29,766 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. మొత్తం అమ్మకాలలో సుమారు 80 శాతం ఆదాయం ప్రభుత్వ ఖాతాకే వచ్చింది. దరఖాస్తు రుసుములు, లైసెన్స్ ఫీజులు కూడా అదనపు ఆదాయం సమకూర్చాయి.
పాత పాలసీ సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరు సమయం లో జరగడం కూడా మద్యం విక్రయాలు పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈసారి కొత్త విధానం లో ప్రభుత్వం ఆదాయం మరింత పెంచుకునేందుకు కొన్ని కీలక మార్పులు చేసింది. మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. అమ్మకాల స్థాయిని బట్టి వార్షిక లైసెన్స్ ఫీజును విభజిస్తూ స్లాబ్ విధానం ప్రవేశపెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో లైసెన్స్ పొందిన ఒక్కో దుకాణం సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రూ.1.10 కోట్లు, రూ.85 లక్షలు, రూ.56 లక్షలు, రూ.55 లక్షలు, రూ.50 లక్షల ఐదు వర్గాలను ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. వార్షిక ఫీజు లో ఆరో వంతును ఇప్పటికే వసూలు చేసింది.
ఇప్పుడే లైసెన్సు పొందిన వ్యాపారులు కొత్త పాలసీ ప్రకారం సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ పాలసీ అమల్లో ఉన్న కాలంలో గ్రామ పంచాయతీ, పరిషత్, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా త్వరలో జరుగనున్న మేడారం జాతరలాంటి భారీ ఉత్సవాలు కూడా మద్యం విక్రయాలు పెరగడానికి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యాపారులు రంగంలోకి అడుగుపెడుతున్నారు.











కామెంట్స్ (1)
ఈ పాలసీతో ప్రభుత్వం కూడా cheers mood లోనే ఉంది