

భారతీయ వృత్తి నిపుణులకు ఎంతో కీలకమైన హెచ్1బీ వీసాల విషయంలో కొత్త ఏడాది నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇక పై వీసాల కేటాయింపులో వేతనం, నైపుణ్యం, అనుభవం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. అయితే ఎంపిక విధానం మాత్రం గతంలో మాదిరిగానే లాటరీ పద్ధతిలోనే కొనసాగనుంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2026 మార్చిలో దాఖలు చేసే హెచ్1బీ దరఖాస్తులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను డిసెంబర్ 29 న USCIS ఫెడరల్ రిజిస్టర్లో అధికారికంగా ప్రకటించింది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం మొత్తం 85 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. ఇందులో అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసిన విదేశీయుల కోసం 20 వేల వీసాలను ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే ఈ వీసాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటంతో ప్రతి ఏడాది సుమారు 7.5 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. అందుకే లాటరీ విధానం కొనసాగుతోంది.
కొత్త నిబంధనల ప్రకారం అమెరికా కార్మికశాఖ నిర్వహించే వేతన సర్వే ఆధారంగా హెచ్1బీ దరఖాస్తుదారులను నాలుగు స్థాయిలుగా విభజించనున్నారు. తక్కువ వేతనం పొందే ప్రవేశ స్థాయి ఉద్యోగులను లెవెల్–1 గా గుర్తిస్తారు. వీరికి ఒక్కసారి మాత్రమే లాటరీలో పాల్గొనే అవకాశం ఉండగా, వీసా లభించే అవకాశం సుమారు 15 శాతం మాత్రమేనని అంచనా. వీరు సాధారణంగా శిక్షణ లేదా పర్యవేక్షణలో పనిచేసే ఉద్యోగులు.
లెవెల్–2 కేటగిరీలో కొంత అనుభవం, మధ్యస్థ వేతనం కలిగిన నిపుణులు ఉంటారు. వీరికి రెండు సార్లు లాటరీలో పాల్గొనే అవకాశం కల్పించనుండగా, వీసా లభించే అవకాశం సుమారు 31 శాతం ఉంటుంది. సీనియర్ స్థాయి బాధ్యతలు నిర్వహించే లెవెల్–3 ఉద్యోగులు మూడు సార్లు లాటరీలో పాల్గొనవచ్చు. వీరికి వీసా వచ్చే అవకాశం సుమారు 46 శాతం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అత్యధిక వేతనం పొందే అత్యున్నత స్థాయి నిపుణులను లెవెల్–4 గా పరిగణిస్తారు. వీరికి నాలుగు సార్లు లాటరీలో అవకాశం ఉండటంతో పాటు, వీసా లభించే అవకాశం సుమారు 61 శాతం ఉంటుందని అంచనా. ఈ కేటగిరీలో అధిక అనుభవంతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్నవారు ఉంటారు.
అయితే ఈ కొత్త హెచ్1బీ నిబంధనలను కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ తెలిపారు. గతంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాల పై కఠిన నిబంధనలు అమలు చేయడానికి ప్రయత్నించగా, కోర్టులు వాటిని అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. అంతేకాదు, అత్యున్నత ప్రతిభ కలిగిన లెవెల్–4 నిపుణులకు హెచ్1బీ అవసరం లేదని, వారికి ఇప్పటికే O-1 వీసాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హెచ్1బీ వీసాకు కనీసంగా బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుందని కూడా ఆమె స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!