

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం మహా జాతర ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో, జాతరకు హాజరయ్యే సుమారు కోటిన్నర మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న జాతర సందర్భంగా భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. గత జాతరలతో పోలిస్తే ఈసారి మరింత అధునాతన ఏర్పాట్లు చేస్తూ, రెడ్డిగూడెం నుంచి జంపన్న వాగు మీదుగా చిలకలగుట్ట వరకు నీటి మట్టాన్ని నిరంతరంగా కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేసింది.
భక్తుల సౌకర్యార్థం నీటిపారుదల శాఖ దాదాపు రూ.50 కోట్ల నిధులతో స్నాన ఘట్టాలను అభివృద్ధి చేసింది. జంపన్న వాగు పొడవునా 348 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, 119 డ్రస్ చేంజింగ్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు, నీటి మట్టాన్ని ఒకే స్థాయిలో ఉంచేందుకు 9 క్రాస్ బండ్లను నిర్మించారు. అదనంగా, జంపన్న ఘాట్ల వద్ద మెట్ల మరమ్మతులు చేపట్టారు. జలాలు కలుషితం కాకుండా నిరంతర క్లోరినేషన్ నిర్వహిస్తూ, భక్తులకు శుభ్రమైన, సురక్షిత స్నాన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!