

మేడారం సమ్మక్క సారక్క మహా జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 28 న జాతర అధికారికంగా ప్రారంభం కానుండగా, గత పది రోజుల నుంచే మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు ఇంకా రెండు రోజులు ఉన్నప్పటికీ, భక్తులు ముందుగానే వచ్చి పరిసర ప్రాంతాల్లో క్యాంపులు వేసుకుని, జంపన్నవాగులో స్నానాలు చేసి, అమ్మవార్ల గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బంగారం సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు.
ఆదివారం ఒక్కరోజే సుమారు లక్ష మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అంచనా. మేడారం ప్రధాన రోడ్లు, గద్దెల పరిసరాలు, జంపన్నవాగు ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి చేరుకుంటున్నారు.
ఈ మహా జాతరను తెలంగాణ ప్రభుత్వం ‘మేడారం 2.0’ గా నిర్వహిస్తోంది. భక్తుల భద్రత కోసం డ్రోన్లు, కెమెరాలు, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే తాగునీరు, వైద్య శిబిరాలు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ నెల 28 న సారలమ్మ రాకతో ప్రారంభమయ్యే ఈ జాతర, 31 న సమ్మక్క సారలమ్మలు తిరిగి వనాలకు వెళ్లడంతో ముగియనుంది. ఈ ఏడాది సుమారు మూడు కోట్ల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!