

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. మకర సంక్రాంతి సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకుని భక్తి పరవశంలో మునిగిపోయారు. సన్నిధానానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాంబలమేడు కొండపై నుంచి మకరజ్యోతి మూడు సార్లు దర్శనమివ్వడంతో శబరిగిరులు “స్వామియే శరణం అయ్యప్ప” నామస్మరణతో మార్మోగాయి.
సముద్ర మట్టానికి సుమారు 3,838 అడుగుల ఎత్తులో వెలిగే ఈ మకరజ్యోతి దర్శనం అయ్యప్ప భక్తులకు అత్యంత పవిత్ర ఘట్టంగా భావిస్తారు. జ్యోతి దర్శన సమయంలో భక్తులు దీపారాధన, భజనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. మకరజ్యోతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు శబరిమల చేరుకున్నారు.
జనవరి 19న స్వామి అయ్యప్ప వారికి ఆభరణాలతో ప్రత్యేక దర్శనం జరగనుండగా, జనవరి 20న ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ వార్షిక ఉత్సవంతో మకర సంక్రాంతి ఉత్సవాలు ముగియనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!