

కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల విషయంలో మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నిర్మాణ సంస్థ అయిన Larsen & Toubro నే కారణమని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు తేల్చినా, సంస్థ మాత్రం ఇప్పటికీ రిపేరు పనులకు ముందుకు రావడం లేదు.
ప్రభుత్వం ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో, మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. అప్పటికీ స్పందించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
2018లో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యి, 2019 మేలో ప్రారంభమైంది. అయితే అదే ఏడాది నవంబర్లో వరదల సమయంలో బ్యారేజీలోని పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. అప్పట్లో దీనిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ విచారణలు చేపట్టింది. రెండూ నిర్మాణ, డిజైన్ లోపాలున్నాయని స్పష్టం చేశాయి.
నివేదికల ఆధారంగా బ్యారేజీ మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రభుత్వం నిర్ణయించింది. అయినా ఎల్అండ్టీ తమ తప్పేమీ లేదని వాదిస్తూ ముందుకు రాలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా కాంట్రాక్ట్ ఉల్లంఘనలు, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ కఠిన చర్యలు సూచించింది.
బ్యారేజీ నిర్మాణం పూర్తయిన రెండేళ్లలో వెలుగులోకి వచ్చిన లోపాలను సరిచేయడం సంస్థ బాధ్యతేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పట్లో ఇచ్చిన పూర్తి సర్టిఫికెట్లను కూడా రద్దు చేసింది. అయినా సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
న్యాయశాఖ అభిప్రాయం మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. అందుకే ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, సంతృప్తికరమైన సమాధానం లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ జాప్యం వల్ల మేడిగడ్డ బ్యారేజీ భవిష్యత్తు మరోసారి ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!