

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు, భారత సంతతికి చెందిన వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించి వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని కోరింది.
మరోవైపు భారత విదేశాంగశాఖ కూడా ప్రత్యేక సూచనలు జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు చేయవద్దని స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులు వేగంగా మారుతున్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపింది. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయంతో సంప్రదింపులో ఉండాలని సూచించింది. అలాగే పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులు, ప్రయాణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని, ఇంకా రాయబార కార్యాలయంలో రిజిస్టర్ కాకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని కోరింది.
ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో ఇప్పటివరకు 2500 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నిరసనలను కొనసాగించాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ మరోసారి పౌరులను అప్రమత్తం చేస్తూ ఇరాన్‌కు ప్రయాణాలను మానుకోవాలని స్పష్టం చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!