

తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి లెక్కింపులో జరిగిన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. 2024 అక్టోబర్ 6 న సీనియర్ అసిస్టెంట్ ఎస్. కృష్ణ కుమార్ పరకామణి రిజిస్టర్లో డబ్బుల నమోదులో తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు చెప్పారు. సుమారు 950 విదేశీ కరెన్సీ నోట్లు (100 డాలర్లు) తక్కువ విలువగా చూపించి టీటీడీకి అప్పగించినట్లు తెలిపారు. అసలు విలువ సుమారు రూ.87.21 లక్షలు కాగా, ఎఫ్ఐఆర్లో మాత్రం రూ.6.74 లక్షల దుర్వినియోగం మాత్రమే చూపించారని ఆయన అన్నారు. అక్టోబర్లో జరిగిన ఘటనపై గత ఏడాది మార్చి 14 న మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఆశ్చర్యకరమని, ఈ ఆలస్యం కారణంగా నిందితుడు అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందినట్లు పేర్కొన్నారు.
ఇంకా పరకామణి ఉద్యోగి పెంచలయ్యపై 24 సార్లు బంగారం దొంగతనం ఆరోపణలు ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. అతని వద్ద 555 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి దొరికినట్లు సమాచారం ఉందని తెలిపారు. గతంలో రవి కుమార్ 800 డాలర్ల దొంగతనం కేసులో పెద్ద వివాదం జరిగిన విషయం గుర్తు చేశారు. ఆ సమయంలో తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రవి కుమార్ రూ.100 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి ఇచ్చినట్లు చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న పెద్ద ఎత్తున అవినీతిపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని భూమన ప్రశ్నించారు. బి.ఆర్. నాయుడు నేతృత్వంలోని టీటీడీ పాలకమండలి శ్రీవారి ఆభరణాలు మరియు కానుకలను రక్షించడంలో విఫలమైందని విమర్శించారు. తిరుమలలో భక్తుల మరణాలు, గోమాతల మరణాలు, అలాగే నెయ్యి కొరత వంటి విషయాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పరకామణిలో జరుగుతున్న ఈ అక్రమాలపై సీఐడీ మరియు ఏసీబీతో సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!