

మెక్సికో భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచేందుకు సిద్ధమవడంపై భారత్ స్పందించింది. ఇరుదేశాలకూ ప్రయోజనం చేకూరేలా చర్చలు జరుపుతామని, అవసరమైతే భారత ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని భారత అధికారులు స్పష్టం చేశారు. ఈ అంశంపై మెక్సికోతో సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని భారత్ భావిస్తోంది.
చైనా, భారత్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేసియా వంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని ఆసియా దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెంచేందుకు మెక్సికో ఇప్పటికే సెప్టెంబరులోనే ప్రతిపాదనలు చేసింది. అప్పటి నుంచే భారత్ మెక్సికోతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 30న అక్కడి భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని మెక్సికో ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి, భారత ఎగుమతులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరింది.
మెక్సికోతో భాగస్వామ్యానికి భారత్ ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, ఇరుదేశాల వ్యాపారులు, వినియోగదారులకు లాభం చేకూరేలా స్థిరమైన వాణిజ్యానికి సిద్ధంగా ఉన్నామని ఒక అధికారి తెలిపారు. అంతేకాదు, ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం చర్చలు ప్రారంభించే అవకాశాలపై కూడా భారత్ ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్, మెక్సికో ఉప ఆర్థిక మంత్రి లూయిస్ రోసెండో మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లు సమాచారం. త్వరలో మరిన్ని చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!