

రాష్ట్రంలో జనగణన ప్రక్రియలో తొలి దశ అయిన హౌస్ లిస్టింగ్‌కు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర కేబినెట్లో తేదీలను ఖరారు చేయడంతో మే 11 నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇది తొలి జనగణన కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఈసారి పూర్తిగా ఆన్లైన్ విధానంలో యాప్ ద్వారా లెక్కలు సేకరించనున్నారు. ఇందుకు సుమారు 88 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా. గతేడాది డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 621 గ్రామీణ మండలాలు, 9,983 రెవెన్యూ గ్రామాలు, 134 పట్టణాలను ప్రాతిపదికగా తీసుకుని లెక్కలు చేపడతారు. పట్టణాల్లో కంటోన్మెంట్ ప్రాంతాలు, జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్స్‌కు ప్రత్యేక కోడ్లు కేటాయించి ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ఉపాధ్యాయులు సహా వివిధ శాఖల సిబ్బందిని వినియోగించుకోనున్నారు. సిబ్బంది నియామక బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
హౌస్ లిస్టింగ్ సర్వేకు సంబంధించి జాతీయ స్థాయి శిక్షణ ఇప్పటికే పూర్తయింది. 66 మంది మాస్టర్ ట్రైనర్లకు మార్చి 5 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తారు. ఫీల్డ్ స్థాయిలో 1,220 మంది వివిధ విభాగాల సిబ్బందికి శిక్షణ అందించనున్నారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా అన్ని శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జనాభా లెక్కల్లో రెవెన్యూ గ్రామం, పట్టణాల్లో వార్డు ఒక్కో యూనిట్‌గా పరిగణించనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు సుమారు 800 మంది జనాభా ఉన్న ప్రాంతాన్ని కేటాయిస్తారు. టెక్నాలజీపై అవగాహన తక్కువగా ఉన్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. హౌస్ లిస్టింగ్ అనంతరం ప్రధాన జనగణన ప్రక్రియ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!