

ఈ రోజు చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవానికి గౌరవంగా హాజరై, స్వయంగా బెలూన్‌లో విహరించారు. సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల ప్రయాణం చేసిన మంత్రి ఈ సాహసాన్ని గొప్ప అనుభవంగా పేర్కొన్నారు. ఈ వేడుక గోల్కొండ కోట దగ్గర ప్రారంభమై, అప్పొజి గూడ శివారులో ముగిసింది.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ, తెలంగాణ పర్యాటక రంగంలో ఇది కొత్త అధ్యాయం అని తెలిపారు. ‘ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్ ఫెస్టివల్’ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని ప్రదర్శిస్తూ, ‘హాట్ ఎయిర్ బెలూన్’ మరియు ‘డ్రోన్ ఫెస్టివల్’ ద్వారా ఆధునిక సాంకేతికత, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని చెప్పారు. “డెస్టినేషన్ తెలంగాణ” బ్రాండ్‌ను బలోపేతం చేసి, దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం అని అన్నారు.
ప్రవాసులు కేవలం సందర్శకులు కాక, గొప్ప అనుభూతిని పొందేలా వినూత్న కార్యక్రమాలను రూపొందించామని మంత్రి జూపల్లి తెలిపారు. కొత్త పర్యాటక విధానం ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ, భాగస్వామ్య పద్ధతిలో ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలు మరియు నాణ్యమైన సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని, కుటుంబాలు, యువత, పిల్లలందరికీ ఈ ఫెస్టివల్ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని మంత్రి జూపల్లి ఆకాంక్షించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!