

వచ్చే ఏడాదిలో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాలకు సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను ఆరు జిల్లాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యం కోసం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా కొత్తగా ఘాట్లను నిర్మించి, మొత్తం 369 స్నాన ఘాట్లను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాల్లో ఈ ఏర్పాట్లు జరగనున్నాయి.
భక్తుల కోసం తక్కువ ధరల్లో టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది. ముఖ్య రోజులలో దాదాపు కోటి మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నందున భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని శాఖల మధ్య సమన్వయానికి నోడల్ అధికారులను నియమించనున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!