

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో తీవ్ర కలకలం నెలకొంది. ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి గ్యాస్ గాలిలోకి ఎగజిమ్మడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో గ్రామస్థులు ప్రాణ భయంతో ఇళ్లను విడిచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మండల తహశీల్దార్ పరిస్థితిని పరిశీలించి, వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ ఘటన పై మంత్రి సుభాష్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణమే మంటలను నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదే గ్రామంలో గత ఏడాది ఆగస్టులో కూడా గ్యాస్ పైప్లైన్ లీక్ జరిగిన విషయం స్థానికుల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించవచ్చని గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత భద్రతా చర్యలు తీసుకుని లీకేజీలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన పై మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓఎన్జీసీ సిబ్బంది మంటలను పూర్తిగా నియంత్రించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!