

ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈరోజు జరుపుకునే అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పశ్చిమ దేశాల్లో యువతపై, ముఖ్యంగా బాలికలపై సోషల్ మీడియా ప్రభావం ప్రతికూలంగా మారుతోందని పేర్కొన్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 25 ఏళ్ల లోపు యువత జీవన విధానం అస్థిరంగా మారుతోందని, దీనికి సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం కారణమని తెలిపారు. ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే వంటి నార్డిక్ దేశాలు కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. కొస్టారికా ఈసారి నాలుగో స్థానానికి ఎగబాకింది. అమెరికా 23వ స్థానంలో, కెనడా 25వ స్థానంలో, బ్రిటన్ 29వ స్థానంలో ఉన్నాయి. అఫ్గానిస్థాన్ మాత్రం అత్యంత అసంతృప్తికర దేశంగా కొనసాగుతోంది.
భారత్ ఈ ఏడాది సంతోషకర దేశాల జాబితాలో 116వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం కంటే రెండు స్థానాలు మెరుగుపడింది. అవినీతి, దాతృత్వం, స్వేచ్ఛ, ఆదాయం, ఆరోగ్య జీవన ప్రమాణాలు వంటి అంశాల్లో కొంత పురోగతి కనిపించింది. దక్షిణాసియాలో నేపాల్ 99వ స్థానంలో, పాకిస్థాన్ 104వ స్థానంలో ఉన్నాయి. అయినప్పటికీ, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడంలో భారత్ ఇంకా సవాళ్లు ఎదుర్కొంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!