

విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా, కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తన దివంగత కుమారుడు ప్రతీక్‌రెడ్డి పేరుతో ఏర్పాటైన ఫౌండేషన్ సాయంతో రూ.8 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించగలగడం ఆనందంగా ఉందన్నారు.
అడ్మిషన్ల సీజన్ వచ్చినప్పుడల్లా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు ఫీజులు తగ్గించాలని వేడుకుంటున్నారని, ఎల్కేజీ స్థాయిలోనే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. తాను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ పాఠశాలలను మూసివేసి అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివేలా ఆదేశాలు జారీ చేస్తానని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కార్పొరేట్ విద్య ప్రాధాన్యం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశారని తెలిపారు. వాల్డార్ఫ్ బోధన విధానంలో నిర్మించిన ఈ పాఠశాలలో 40 ఏసీ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్స్, యోగా సెంటర్, గ్రంథాలయం, స్టెమ్ విద్య, స్మార్ట్ లెర్నింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!