
.jpg&w=3840&q=75)
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్ద ఈరోజు దర్శనాలు నిలిపివేయడంతో భక్తుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. దూరప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు తెల్లవారుజామునే ఆలయం ఎదుట నిరీక్షించారు. కానీ ఆలయ అధికారులు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రధాన గేటుకు తాళం వేయడంతో భక్తులు ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యారు.
ఆలయంలోకి ప్రవేశం నిరోధించేందుకు అధికారులు ఇనుప రేకులు ఏర్పాటు చేయడంతో భక్తులు బయటే ఆగిపోయారు. గంటల తరబడి చలిలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ఎదురుచూసినా, అధికారులు ఎలాంటి సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించాలనుకున్నామని, ఇంత అనూహ్యంగా దర్శనాలు నిలిపివేయడం న్యాయమేమీ కాదని వారు విమర్శించారు.
ఇక, పరిస్థితిని నియంత్రించేందుకు ఆలయ అధికారులు ప్రచార రథం ద్వారా స్వామివారి చిత్రాన్ని ప్రదర్శిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. అదేవిధంగా ఎల్ఈడి తెరపై స్వామివారి దివ్య రూపం చూపించే ఏర్పాట్లు చేశారు. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ప్రస్తుతం భీమేశ్వరాలయంలో కూడా భక్తులకు దర్శనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. అయితే ఈ వివరణతో భక్తులు సంతృప్తి చెందలేదు. “ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, గంటల తరబడి వేచిచూడాల్సి రావడం మనసుకు బాధ కలిగించింది” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.




.avif&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!