

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2025 లో రాష్ట్రంలో మొత్తం నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక–2025 ను అధికారులతో కలిసి డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024 లో మొత్తం 2,34,158 కేసులు నమోదైతే, 2025 లో అవి 2,28,969 కి తగ్గినట్లు వెల్లడించారు.
బీఎన్ఎస్ చట్టం కింద నమోదైన కేసులు కూడా తగ్గాయని తెలిపారు. 2024 లో 1,69,477 కేసులు నమోదు కాగా, 2025 లో 1,67,018 కేసులే నమోదయ్యాయని, ఇది 1.45 శాతం తగ్గుదలని చెప్పారు. నేర నిరూపణ శాతం గణనీయంగా పెరిగిందని డీజీపీ వివరించారు. గత ఏడాది 35.63 శాతంగా ఉన్న కన్విక్షన్ రేటు, ఈ ఏడాది 38.72 శాతానికి చేరిందన్నారు. 2025 లో నాలుగు కేసుల్లో నిందితులకు మరణశిక్ష విధించగా, 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ శిక్ష పడిందన్నారు.
పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొత్తం 141 కేసుల్లో 154 మందికి జీవిత ఖైదు, మూడు కేసుల్లో నిందితులకు మరణశిక్ష విధించబడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన 28 కేసుల్లో 53 మందికి యావజ్జీవ శిక్ష పడిందని వెల్లడించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు, మిస్ వరల్డ్ పోటీలు, అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ పాల్గొన్న కార్యక్రమం, వరదలు వంటి విపత్తులను కూడా తెలంగాణ పోలీస్ సమర్థవంతంగా నిర్వహించిందని డీజీపీ పేర్కొన్నారు.
మావోయిస్టు కార్యకలాపాల పై గట్టి చర్యల ఫలితంగా 2025 లో మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని, అందులో 23 మంది తెలంగాణకు చెందినవారని తెలిపారు. సైబర్ నేరాల విషయంలో రాష్ట్రం మంచి ఫలితాలు సాధించిందన్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 41 శాతం పెరిగినా, తెలంగాణలో మాత్రం 3 శాతం తగ్గాయని చెప్పారు. ఫోన్ రికవరీలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని, రోజుకు సగటున 111 ఫోన్లు రికవరీ అవుతున్నాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా హత్యలు 8.76 శాతం, అత్యాచారాలు 13.45 శాతం, దోపిడీలు 27 శాతం, దొంగతనాలు 9.1 శాతం తగ్గాయని వెల్లడించారు. అయితే నమ్మకద్రోహం కేసులు 23 శాతం పెరిగాయని తెలిపారు. వరకట్నం కోసం మహిళల హత్యలు 2 శాతం తగ్గాయని, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ చురుగ్గా పనిచేస్తున్నాయని డీజీపీ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గగా, సైబర్ నేరాల్లో రికవరీ 23 శాతం పెరిగిందన్నారు. ఈ ఏడాది మొత్తం రూ.246 కోట్లను రికవరీ చేయగా, 24,498 మంది బాధితులకు రూ.159.65 కోట్లను రిఫండ్ చేసినట్లు తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!