

తెలంగాణలో ఎల్పీజీ పంపిణీని సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సివిల్ సప్లై శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 24/7 మల్టీ ఏజెన్సీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్‌ను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రియల్ టైమ్ GPS ట్రాకింగ్ ద్వారా గ్యాస్ సిలిండర్ల రవాణా, పంపిణీ ప్రక్రియలను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో IOCL, BPCL, HPCL సంస్థల ప్రతినిధులతో పాటు పోలీస్, ఇండస్ట్రీస్ విభాగాలు, డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఫ్లీట్‌కు సంబంధించిన GPS ట్రాకింగ్ యాక్సెస్ ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో ఎల్పీజీ ట్రాన్స్‌పోర్టేషన్, స్టాక్ లెవెల్స్, జిల్లా వారీగా పంపిణీ పరిస్థితులపై కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ కేంద్రానికి అదనంగా సివిల్ సప్లై టోల్ ఫ్రీ నంబర్ 1967ను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్‌పై కొంత కన్ఫ్యూషన్ కొనసాగుతోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామని, అలాగే ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కూడా సమావేశం జరిపినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 810 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, సుమారు 1.3 కోట్ల డొమెస్టిక్ వినియోగదారులు, 7.5 లక్షల కమర్షియల్ వినియోగదారులు ఉన్నారని మంత్రి వివరించారు. ప్రతి నెల సగటున 60 లక్షల డొమెస్టిక్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయని తెలిపారు. గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లలో ఎలాంటి కొరత లేదని, అయితే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంత తగ్గుదల ఉందని చెప్పారు. సాధారణంగా రోజుకు 23 వేల కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం సుమారు 6,200 సిలిండర్లు మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. స్కూల్స్, కాలేజీలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కమర్షియల్ సిలిండర్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కావాలని కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు సహాయం అందించేందుకు సివిల్ సప్లై భవన్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి 180042500344 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!