

2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల చేరిక కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు చురుకుగా చర్యలు చేపడుతుండగా, తల్లిదండ్రులు కూడా నాణ్యమైన విద్య అందించే పాఠశాలలను ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఏ పాఠశాలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో, ఏవి అనుమతి లేకుండా నడుస్తున్నాయో తెలుసుకోవడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. దీనికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితాను పాఠశాల విద్యాశాఖ తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్ర బోర్డుతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి వివిధ బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల వివరాలను జిల్లా, మండలాల వారీగా అందిస్తున్నారు.
ఈ జాబితాను చూడాలంటే ముందుగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ను తెరిచి, రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితా అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ జిల్లా, మండలం ఎంపిక చేస్తే పాఠశాల పేరు, స్థాపించిన సంవత్సరం, బోర్డు, చిరునామా వంటి వివరాలు కనిపిస్తాయి.
పాఠశాల గుర్తింపు గడువు వంటి అదనపు వివరాలను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఈ జాబితాను పరిశీలించి, తమ పిల్లలను సరైన పాఠశాలలో చేర్పించాలని సూచిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!