

అమరావతి:
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో పొరపాట్లు జరుగుతున్నాయని ఎన్డీడీబీ (NDDB) నివేదిక స్పష్టంగా చెప్పిందని, అలాగే సీబీఐ నివేదికలో కూడా “కల్తీ జరగలేదని” ఎక్కడా తేల్చి చెప్పలేదని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యవహారం కేవలం రాజకీయ అంశం కాదని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన విషయం అని పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి తన ఇంటి కులదైవమని చెబుతూ, గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో సీఎఫ్టీఆర్ఐ 2022లోనే కల్తీ జరుగుతోందని స్పష్టంగా నివేదిక ఇచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళనలో భాగంగా లడ్డూ నమూనాలను ఎన్డీడీబీకి పంపించామని, సిట్ నివేదికలో రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అంతర్వేది రథదగ్ధం, రామతీర్థం విగ్రహ ధ్వంసం వంటి ఘటనల్లోనూ చర్యలు తీసుకోకుండా తిరిగి తమపై ఆరోపణలు చేశారని అన్నారు. బ్రిటీషర్లు కూడా సంప్రదాయాలను గౌరవించారని, వారికంటే హీనంగా గత పాలకులు వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లక్షలాది భక్తులకు కల్తీ నెయ్యితో చేసిన లడ్డూను ప్రసాదంగా ఇచ్చినది మహాపాపమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా తిరుమల రావాలన్నా, లడ్డూ తినాలన్నా భక్తులు భయపడిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు జరిగిన అపచారాన్ని దారి మళ్లించేందుకు ఎదురుదాడులు చేస్తున్నారని ఆరోపించారు. దోషులను ఎవరినీ వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, భక్తుల విశ్వాసం, నమ్మకంపై దాడి చేసిన వారిని చరిత్ర క్షమించదని ఆయన హెచ్చరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!