

రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్‌వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆవకాయ్ – అమరావతి సినిమా, సంస్కృతి, సాహిత్యోత్సవం’ విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికగా ఈ నెల 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. తెలుగు సినిమా, సాహిత్యం, సంస్కృతిని ప్రపంచానికి చాటడమే ఈ ఉత్సవాల లక్ష్యం.
సీఎం నారా చంద్రబాబు నాయుడు చొరవతో, మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఈ వేడుకలు నిర్వహించబడుతున్నాయి. సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, ఆధునిక కళా ప్రదర్శనలు ఉత్సవాల్లో భాగంగా ఉంటాయి. సందర్శకులకు ప్రవేశం ఉచితం. ఆన్లైన్లో www.avakaifestival.com ద్వారా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
హౌస్‌బోట్స్, రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా నదీ తీరాల్లో ఈ తరహా సేవలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఫెస్టివల్లో దేశ విదేశాల నుంచి ప్రముఖ కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొంటారు. హెరిటేజ్ వాక్, ఫుడ్ ఫెస్టివల్, ఘాట్ ఫెర్రీ రైడ్, జావేద్ అలీ సంగీత కచేరి, వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించనున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
రేపు సాయంత్రం ప్రారంభోత్సవ ఊరేగింపుతో వేడుకలు మొదలవుతాయి. రెండో రోజు భవానీ ఐలాండ్, పున్నమి ఘాట్లలో సాహిత్య, సినిమా, సంగీత, నృత్య, వర్క్‌షాప్‌లు జరుగుతాయి. మూడో రోజు చర్చా కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు, ఎన్టీఆర్‌కు నివాళి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!