

మెట్రో నగరాల్లో ప్రైవేట్ యాప్‌ల ద్వారా ఆటోలు, క్యాబ్‌లు బుక్ చేసుకోవడం సాధారణం. ఇదే విధంగా, ప్రజలకు మరింత చౌకగా మరియు భద్రంగా రవాణా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో 'ఆంధ్రా ట్యాక్సీ' అనే కొత్త పోర్టల్/యాప్‌ను రూపొందించారు. త్వరలోనే ఈ యాప్‌ను ప్లే స్టోర్‌లో విడుదల చేయనున్నారు. విజయవాడ దుర్గగుడి, భవానీ ద్వీపం, కృష్ణా తీరం ఆలయాలు వంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకుల కోసం సురక్షితమైన, మితమైన రవాణా సేవలు అందించడమే ఈ యాప్ లక్ష్యం.
స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్లు పర్యాటకుల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త యాప్ మోసాలకు చెక్ పెడుతుందని అధికారులు చెబుతున్నారు. యాప్‌లో క్యాబ్‌లు, ఆటోలు వాట్సాప్, ఫోన్ కాల్, యాప్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. అవసరమైన ప్రాంతంలో లభ్యమయ్యే వాహనాలు డ్రైవర్ వివరాలతో కనిపిస్తాయి. రవాణా శాఖ ద్వారా పరీక్షించి, ఫిట్నెస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు.
మహిళల భద్రత దృష్ట్యా, వాహన బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. వాహనాల మొత్తం డేటా రాష్ట్ర డేటా సెంటర్లో సురక్షితంగా నిల్వ ఉంటుంది. విజయంవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు రవాణాతో పాటు హోటల్ గదుల బుకింగ్ ఆప్షన్ కూడా అందిస్తున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ సేవలను కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో భాగంగా అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!