

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చుతున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్, ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో విద్యుత్తు రంగం కుప్పకూలిందని విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని స్థిరపరిచి, 1.13 కోట్ల గృహ వినియోగదారులకు ఛార్జీలు పెంచకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు.
రాష్ట్రాన్ని శుభ్రమైన శక్తి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం చెప్పారు. 160 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 117 ప్రాజెక్టులకు ఆమోదం లభించి, భారీ పెట్టుబడులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు రూఫ్‌టాప్ సోలార్ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అలాగే ఆర్టీసీలో 1,050 ఈవీ బస్సులు ప్రవేశపెట్టడం, 5,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా ఏపీని సౌర విద్యుత్తు కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!