

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ భయానక ఘటనలో ఉగ్రవాదులకు ఎదురొడ్డి పలువురి ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా అహ్మద్ అల్ అహ్మద్ ప్రశంసలు అందుకుంటున్నారు. దాడి సమయంలో “నేను చచ్చిపోతున్నా.. నా కుటుంబానికి చెప్పు” అంటూ ఆయన చెప్పిన మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి.
సిరియా నుంచి దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చిన అహ్మద్, కుటుంబంతో కలిసి దక్షిణ సిడ్నీలోని సదర్లాండ్ షైర్లో నివసిస్తున్నారు. ఇద్దరు చిన్న పిల్లల తండ్రైన ఆయన స్థానికంగా పండ్ల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన రోజు ఉదయం బోండీ బీచ్‌లోని కాఫీ షాప్‌లో తన బంధువు జోజీ అల్కాంజ్‌తో ఉన్న సమయంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. తొలుత భయపడినా, వెంటనే ధైర్యం కూడగట్టుకుని ఉగ్రవాదులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు.
దాడి సమయంలో కాల్పులు జరుపుతున్న దుండగుల్లో ఒకడిని అహ్మద్ వెనక నుంచి వచ్చి అడ్డుకుని తుపాకీ లాక్కున్నాడు. దీంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమయంలో అహ్మద్ గాయపడగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన సాహసాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసిస్తూ, ఇలాంటి ధైర్యసాహసాలు గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడినవారు తండ్రి–కొడుకులని పోలీసులు గుర్తించగా, ఒకరు మృతి చెందగా మరొకరిని అరెస్టు చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!