

అత్యవసర పరిస్థితుల్లో విమానయాన భద్రతకు కొత్త మైలురాయిగా నిలిచే ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. డెన్వర్ సమీపంలోని Rocky Mountain Metropolitan Airport లో ఒక విమానం పైలట్ జోక్యం లేకుండా పూర్తిగా ఆటోమేటిక్ విధానంలో సురక్షితంగా రన్‌వే పై ల్యాండ్ అయింది.
ఈ ఘటనలో భాగమైనది రెండు ఇంజిన్లతో కూడిన Beechcraft Super King Air 200 విమానం. ల్యాండింగ్ అనంతరం విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చారు.
ఈ విమానంలో Garmin అభివృద్ధి చేసిన ఆటోలాండ్ సిస్టమ్ అమర్చబడింది. అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే ఈ సిస్టమ్ స్వయంచాలకంగా నియంత్రణ చేపట్టి, సమీప విమానాశ్రయాన్ని గుర్తించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఆటోమేటెడ్ వాయిస్ ద్వారా సంప్రదింపులు జరిపింది.
లైవ్ ఏటీసీ కమ్యూనికేషన్‌ను ప్రసారం చేసే LiveATC.net లో ఈ ఆటోమేటెడ్ వాయిస్ స్పష్టంగా వినిపించింది. సమీపంలోని ఇతర పైలట్లకు అలర్ట్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే విమానం రన్‌వే పై సాఫీగా దిగింది. ఈ సందర్భంగా గర్మిన్ సంస్థ స్పందిస్తూ, ఇప్పటికే దాదాపు 1,700 విమానాల్లో ఆటోలాండ్ సిస్టమ్‌ను అమర్చామని, అయితే బీచ్‌క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ 200 విమానంలో ఈ వ్యవస్థను అత్యవసర పరిస్థితిలో వినియోగించడం ఇదే తొలిసారి అని వెల్లడించింది.
ఈ ఘటనతో, భవిష్యత్తులో విమానయాన రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఆధారిత భద్రతా వ్యవస్థలు ఎంత కీలకంగా మారబోతున్నాయో మరోసారి స్పష్టమైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!