

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ విడుదల తేదీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఐపీఎల్ సీజన్ జోరుగా సాగనుండటంతో సినిమాను వాయిదా వేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేపథ్యంలో భారీ చిత్రాల బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ని ఏప్రిల్ నుంచి జూలై చివరి వారానికి మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడుదల తేదీ మార్పుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు, ‘వారణాసి’ షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, సీజీ, రీ-రికార్డింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. కాలాన్ని చుట్టేసే సాహసంతో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్ర, శ్రీరాముడు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐపీఎల్ కారణంగా విడుదల తేదీ మారుతుందా? లేక ప్రకటించిన తేదీకే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనేది చిత్రబృందం అధికారిక ప్రకటనతో స్పష్టత రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!