

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) – 2026 వేడుకలు బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాల్లో పురస్కారాలు అందించారు.
‘మిరాయ్’ చిత్రానికి తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఐశ్వర్య రాజేశ్ ఉత్తమ నటి (క్రిటిక్స్) పురస్కారం సొంతం చేసుకున్నారు. అదే చిత్రంలోని నటనకు బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా నిలిచారు. ‘కాంతార: చాప్టర్ 1’లో నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ‘మోగ్లీ’కి సాక్షి మడోల్కర్ ఉత్తమ నటి (పరిచయ)గా, ‘కోర్ట్’ చిత్రానికి పూర్ణా చారి ఉత్తమ గేయ రచయితగా, శ్రీదేవి ఉత్తమ నటి (పరిచయ)గా, హర్ష్ రోషన్ ఉత్తమ నటుడు (పరిచయ)గా అవార్డులు అందుకున్నారు. ‘కింగ్డమ్’కు సత్యదేవ్ ఉత్తమ సహాయ నటుడిగా, ‘డాకు మహారాజ్’కు శ్రద్ధా శ్రీనాథ్ ఉత్తమ సహాయ నటిగా నిలిచారు. ‘మిరాయ్’కు కార్తిక్ ఘట్టమనేని ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు అందుకోగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’కు రమణ గోగుల ఉత్తమ నేపథ్య గాయకుడిగా, ‘కోర్ట్’కు సమీరా భరద్వాజ్ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలు అందుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!