

సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రానికి ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా 2027 జనవరి 12న థియేటర్లలోకి రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా 158 కూడా సంక్రాంతి బరిలోకి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఈ ప్రకటన ఆసక్తిని పెంచింది. ఈ విషయంపై మరింత స్పష్టత ఆగస్టు 22న వచ్చే అవకాశం ఉంది.
ఇక ‘సంబరాల ఏటిగట్టు’కు సంక్రాంతి సీజన్‌లో గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కూడా సంక్రాంతి లక్ష్యంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లోని ‘జార్జ్ క్రిష్’ ఇప్పటికే జనవరి 12 తేదీని ప్రకటించింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ను కేజీఎఫ్ తరహా పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. బ్రిటిష్ పాలన ముగిసిన అనంతరం ఓ ప్రాంతంలో చోటుచేసుకున్న విధ్వంసకాండ నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. సాధారణంగా సంక్రాంతి సినిమాల్లో వినోదం, కామెడీకి ప్రేక్షకులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే పూర్తి భిన్నమైన నేపథ్యంతో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ ఈ సెంటిమెంట్‌ను ఎంతవరకు బ్రేక్ చేస్తుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!