

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తాజా చిత్రం ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయాన్ని అందుకున్న ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ సినిమాను వచ్చే నెల 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాత కేఎస్ రామారావు అధికారికంగా ప్రకటించారు. విభిన్నమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ బి శెట్టి ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను ఆరంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠకు గురిచేస్తుందని చిత్రబృందం చెబుతోంది.
విడుదల తేదీ మార్పుపై స్పందించిన నిర్మాత కేఎస్ రామారావు, సినిమా మేకింగ్ విలువలు మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు. అందుకే ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. మొదట ఈ సినిమాను వచ్చే నెల 1న విడుదల చేయాలని భావించినప్పటికీ, మరింత మంచి థియేటర్లు మరియు గరిష్ట స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడానికి వచ్చే నెల 7కు మార్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఐపీఎల్ సందడి, ఓటీటీ పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ బలంగా ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘రాక్షసపురం’ కూడా అదే కోవలో నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. త్వరలోనే ట్రైలర్‌తో పాటు ఇతర ప్రోమోలను విడుదల చేసి ప్రమోషన్స్‌ను వేగవంతం చేయనున్నట్లు సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!