

‘‘ది రాజాసాబ్’ సినిమాలోని కొత్త పాయింట్‌పై ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఈ సినిమా ఫలితాన్ని ఒక్క షోతోనో, ఒక్క రోజులోనో నిర్ణయించవద్దని, కనీసం పది రోజులు ఆగితే సినిమాకు వచ్చే స్పందన అర్థమవుతుందని తెలిపారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్‌ను శనివారం సాయంత్రం నుంచే సినిమాలో జత చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ చిత్రానికి హైదరాబాద్‌లో బ్లాక్‌బస్టర్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో సినిమాలో అలా చూపించానని చెప్పారు. 40 నిమిషాల పాటు సాగే మైండ్ గేమ్ క్లైమాక్స్‌కు మంచి స్పందన వస్తోందని, ఇంతకు ముందు ఇండియన్ స్క్రీన్‌పై కమర్షియల్ హీరోతో ఇలాంటి ప్రయత్నం జరగలేదని తెలిపారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త కథలు పెద్ద హీరోలు చేయాలనే ప్రభాస్ ఆలోచనతోనే ఈ సినిమా వచ్చిందని వివరించారు. టీజర్, ట్రైలర్లలో చూపిన ఓల్డ్ గెటప్ సినిమాలో లేకపోవడంతో కొంతమంది నిరాశ చెందారని, అందుకే ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు తగ్గించి కొత్తగా సుమారు 8 నిమిషాల సన్నివేశాలను జత చేస్తున్నామని తెలిపారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, తొలి రోజు రూ.100 కోట్ల వసూళ్ల అంచనాలను మించి రూ.112 కోట్లు వచ్చాయని తెలిపారు. ఇది మంచి హారర్ ఫాంటసీ సినిమా అని, పిల్లలతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!