

తెలుగు ప్రజల ప్రధాన పండుగ సంక్రాంతికి కేవలం 70 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో టాలీవుడ్ నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూ భారీ సినిమాలను పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఖర్చుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వీరి ధీమా ఒక్కటే — ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుతాయనే నమ్మకం!
టికెట్ల ధరల పెంపు అంశంపై ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, టికెట్ల ధరలు పెంచడం తప్పు కాదు, కానీ అది ప్రభుత్వాల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకంతోనే నిర్మాతలు పెద్ద మొత్తంలో సొమ్ములు వెచ్చిస్తున్నారని చెప్పొచ్చు.
దక్షిణాది రాష్ట్రాలు సినిమా పరిశ్రమకు ప్రభుత్వం నుంచి మద్దతు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇటీవల సినిమాలకు సానుకూలంగా ఉంది. సినీ నేపథ్యం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సినీ రంగానికి సహకరిస్తున్నారు.
కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తాజా నిర్ణయం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. టికెట్ల ధరలు పెంచితె వచ్చే ఆదాయంలో 20 శాతం సొమ్మును సినీ కార్మికులకు ఇవ్వాలి అనే ఆలోచనను ఆయన వెల్లడించారు. ఆ ఆలోచన మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ, అమలు చేయడం కష్టమనే అభిప్రాయం నిర్మాతలలో వ్యక్తమవుతోంది.
టికెట్ ధరలు పెంచినా అందులో కొంత భాగం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. ఇప్పుడు మిగిలిన మొత్తంలో 20% కార్మికులకు ఇవ్వాలంటే, నిర్మాతలకు అదనపు భారమవుతుంది. దాంతో మరింతగా టికెట్ ధరలు పెంచాల్సి వస్తుంది. కానీ సాధారణ ప్రేక్షకుడు ఆ ధర చెల్లించి థియేటర్‌కు వస్తారా? అనేది పెద్ద ప్రశ్న.
అదనంగా, పైరసీ సమస్య సినిమాలను వెంటాడుతూనే ఉంది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే నెట్టింట్లో లీక్ అవుతుండటంతో, టికెట్ ధరలు పెంచినా లాభం లేదన్న భావన నిర్మాతల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 20 శాతం కార్మికులకు ఇవ్వడం అమల్లోకి వస్తుందా? అనేది సమయం చెబుతుంది.











కామెంట్స్ (3)
విచారణీయమైనది
piracy is a real issueee
Higher ticket prices might push viewers away from theatres.