

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడి వస్తున్నారు. సంక్రాంతి పండగ సెలవులు కలిసిరావడంతో టికెట్ల బుకింగ్స్ భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రీమియర్ షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.84 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో సోమవారం ఒక్క రోజే రూ.65 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్ షోల ద్వారా సుమారు రూ.15 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం.
దర్శకుడు అనిల్ రావిపూడి కమర్షియల్ టచ్, పండగ సీజన్ కలిసి రావడంతో ఈ సినిమా వచ్చే వారం రోజుల పాటు కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా, నయనతార హీరోయిన్‌గా మెరిసారు. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సుమారు 20 నిమిషాల పాటు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిరంజీవి–వెంకటేష్ కాంబినేషన్, అనిల్ రావిపూడి టైమింగ్ కలిసి సినిమాకు అదనపు బలంగా మారినట్లు అభిమానులు చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!