

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మైత్రి రవి ‘ఫౌజీ’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాతో ప్రభాస్‌కు అద్భుతమైన విజయం దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్ లేని రోజున కూడా ప్రభాస్ సెట్‌కు వచ్చి మానిటర్ ముందు కూర్చొని ప్రతి సన్నివేశాన్ని పరిశీలించారని, దీనిని బట్టి సినిమాపై ఆయనకున్న నమ్మకం అర్థమవుతుందని తెలిపారు.
ఇదే సందర్భంలో ‘ఇరుముడి’ ట్రైలర్ కార్యక్రమం గురించి ప్రభాస్‌తో జరిగిన సంభాషణను మైత్రి రవి గుర్తుచేసుకున్నారు. రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పగా, అభిమానులకు ఏదైనా చెప్పాలా అని ప్రభాస్‌ను అడిగినట్లు తెలిపారు. అందుకు ప్రభాస్ నవ్వుతూ ‘‘కాలేజీ అంటున్నారు కదా.. మంచిగా చదువుకోమని చెప్పండి’’ అని సరదాగా చెప్పినట్లు వెల్లడించారు. దీంతో ‘ఫౌజీ’పై ప్రభాస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, నిర్మాతలు వ్యక్తం చేస్తున్న ధీమా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!