

కరవు సీమగా పేరున్న రాయలసీమను ఉద్యాన రంగంలో కీలక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 2న జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తదితరులు పాల్గొన్నారు. రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు 10 జిల్లాల్లో 201 క్లస్టర్ల ద్వారా అమలు కానుండగా.. అదనంగా ఆరు లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగును విస్తరించే ప్రణాళిక ఉంది. The Times of India
రైతులకు ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు సమగ్ర మద్దతు అందించడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. మరోవైపు రిలయన్స్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో ఆధునిక సాంకేతికత, పరిశోధన, డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, స్మార్ట్ ఇరిగేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్టనున్నారు. కార్యక్రమంలో అనంత్ అంబానీ తనను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించి రాష్ట్ర అభివృద్ధికి తాను ఎలా సహకరించాలో మార్గనిర్దేశం చేయాలని చంద్రబాబును కోరారు. అనంత్ అంబానీని ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డగా భావిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!