

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన నుంచి పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ కుడుముల పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ‘ఇట్లు అర్జున’ విజయోత్సవ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, తాను సాధారణంగా ఏ దర్శకుడినీ సినిమా చేయాలని అడగనని, కానీ వెంకీ కుడుములను మాత్రం అడిగానని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆయన తనను మెప్పించే కథను ఇంకా తీసుకురాలేదంటూ చమత్కరించారు. దీంతో ఈ ఇద్దరి కలయికలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది.
గతంలోనే చిరంజీవి కోసం వెంకీ కుడుముల ఓ కథను సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ద్వితీయార్థం విషయంలో మెగాస్టార్‌కు పూర్తిస్థాయి సంతృప్తి కలగకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై వెంకీ స్పందిస్తూ, త్వరలోనే ఓ బలమైన వినోదాత్మక కథతో చిరంజీవిని కలుస్తానని తెలిపారు. ఆయనపై తనకు ఎప్పటికీ ప్రేమ, అభిమానం ఉంటాయని స్పష్టం చేశారు. దీంతో మరోసారి కథను సిద్ధం చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి తన కథతో మెగాస్టార్‌ను ఒప్పించి సినిమా ఖరారు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!