

గోవా వేదికగా ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న ఈ చిత్రోత్సవంలో ‘స్టోరీస్ వితౌట్ బోర్డర్’ థీమ్‌తో వివిధ దేశాలు, భాషలకు చెందిన సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈసారి పలు తెలుగు చిత్రాలకు కూడా ప్రదర్శనకు అవకాశం లభించింది. వాటిలో చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఒకటి. నయనతార కథానాయికగా నటించగా, వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ కూడా ఎంపికైంది. పాటల ద్వారానే భావాలను వ్యక్తం చేసే ఓ విచిత్రమైన గ్రామం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ నటించిన సూపర్‌నేచురల్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్‌స్టోరీ’ కూడా ప్రదర్శితం కానుంది. వీటితోపాటు కృష్ణంరాజు ప్రధాన పాత్రలో బాపు తెరకెక్కించిన 1976 నాటి క్లాసిక్ ‘భక్త కన్నప్ప’ 50 ఏళ్ల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రదర్శించనున్నారు. చెస్ నేపథ్యంలో రూపొందిన ‘విన్’, యువతి వ్యక్తిగత లక్ష్యాల చుట్టూ సాగే ‘వై, వాణి?’ చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇక తెలుగు ఓటీటీ రంగానికి కూడా ఇఫిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా క్రియేటర్‌గా వ్యవహరించిన ‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ వెబ్‌సిరీస్ ఉత్తమ వెబ్‌సిరీస్ (ఓటీటీ) విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వెబ్‌సిరీస్‌గా ఇది నిలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలుత స్నేహితులుగా ఉండి, ఆ తర్వాత ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు ప్రముఖ నేతలను పోలిన పాత్రలతో ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించగా.. దేవా కట్టా, కిరణ్ జయ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సినిమాలతోపాటు వెబ్ కంటెంట్‌కు కూడా అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించడం విశేషంగా నిలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!