

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులకు సంబంధించి ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏకంగా రూ.290 కోట్ల భారీ ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ డీల్‌పై చిత్రబృందం లేదా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఒప్పందం నిజమైతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.225 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. వారణాసి హక్కుల కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కూడా పోటీపడినట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్, గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌లో మరో కీలక అప్‌డేట్ రానుందనే ప్రచారం కూడా సాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!