

ఒక సినిమాకు ఏడాది సమయం తీసుకునే పద్ధతికి స్వస్తి చెబుతూ టాలీవుడ్ అగ్ర హీరోలు, యువ కథానాయకులు వరుస సినిమాలతో బాక్సాఫీస్ బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. చిరంజీవి ఇప్పటికే మన శంకరవరప్రసాద్‌గారుతో విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు విశ్వంభరతో దసరా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న తన 158వ చిత్రాన్ని 2027 సంక్రాంతికి తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. వెంకటేశ్ కూడా ఇదే తరహాలో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం: హౌస్ నెం 47 అక్టోబరు 2న విడుదల కానుండగా.. కల్యాణ్‌రామ్‌తో కలిసి అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తున్నారు. ది రాజాసాబ్ తర్వాత ఫౌజీ డిసెంబరు 3న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రవితేజ ఈ నెలలో ఇరుముడితో సందడి చేయనుండగా.. అనంతరం హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణుతో కలిసి నటించే కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సంక్రాంతి లక్ష్యంగా సిద్ధం చేస్తున్నారు. యువ కథానాయకుడు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి విజయానంతరం భోగితో ప్రేక్షకులను పలకరించనున్నారు. శ్రీను వైట్లతో మరో చిత్రానికీ ఆయన సిద్ధమవుతున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన చిత్రాలతో బిజీగా ఉన్నారు. రణబాలి నవంబరులో, రౌడీ జనార్ధన వేసవి సీజన్‌లో విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా టాలీవుడ్‌లో అగ్ర హీరోల నుంచి యువ కథానాయకుల వరకు వరుస చిత్రాల జోరు కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!